గత ప్రభుత్వం దుబారా ఖర్చులతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసింది : శ్రీధర్‌బాబు - six guarantees
Published : Jan 14, 2024, 9:25 AM IST
Minister Sridhar Babu on Six Guarantee Schemes :రాష్ట్రంలో అర్హులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయడమే లక్ష్యంగా పని చేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం, హెల్త్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం దుబారా ఖర్చులు పెట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతుందని, ప్రజలకు పథకాలను అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు. 2014 సంవత్సరంలో టీఆర్ఎస్ గెలిచిన తర్వాత హింసాత్మక చర్యలకు పాల్పడ్డారని, కానీ నెల రోజులుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎలాంటి హింస లేకుండా ప్రశాంతంగా ప్రజాపాలన కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు. అనంతరం మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణి లక్ష్మి చెక్కులు పంపిణీ చేసి, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.