మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలపై చర్చించాం : కొండా సురేఖ - తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ కేబినెట్ సమావేశం
Published : Dec 8, 2023, 5:07 PM IST
Minister Konda Surekha Interview :కాంగ్రెస్ ప్రభుత్వ తొలి మంత్రివర్గ సమావేశంలో ఆరు గ్యారంటీ(Six Guarantees)లపై చర్చించినట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ, తమకు ఇంకా శాఖలు కేటాయించలేదని పేర్కొన్నారు. అధిష్ఠానం నిర్ణయం ప్రకారం తమకు ఏ శాఖ అప్పగించినా బాధ్యతగా విధులు నిర్వర్తిస్తామని కొండా సురేఖ వివరించారు.
ఇక తెలంగాణ రాజకీయాల్లో కొండా సురేఖ ఒక ఫైర్ బ్రాండ్. రాజకీయాల్లో కొండా సురేఖ స్టైలే వేరని చెప్పాలి. ఏ పార్టీలో పని చేసినా వీర విధేయత చూపించే ఆమె అంతే స్థాయిలో అవసరమైతే ధిక్కార స్వరాన్ని వినిపించారు. సుమారు 25 ఏళ్ల క్రితం ఒక సాధారణ ఎంపీపీగా రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టినా కొండా సురేఖ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను సైతం ప్రభావితం చేసే స్థాయికి ఎదిగారు.
రాజకీయంగా తనను ఎవరు ఎంత అణగదొక్కాలని ప్రయత్నం చేసినా నిలదొక్కుకుని ధైర్యంతో ముందుకు సాగారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలోనూ కేసీఆర్‌పై ధిక్కార గొంతుకను వినిపించిన ఆమె, చారిత్రక ఓరుగల్లు పౌరుషానికి ప్రతీకగా రాజకీయాలలో ఫైర్ బ్రాండ్‌గా నిలిచారు. ప్రస్తుతం వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన కొండా సురేఖ, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు.