Harishrao fires on Revanthreddy : 'రేవంత్‌రెడ్డి... రాజకీయ ప్రస్థానం ఆర్‌ఎస్‌ఎస్ నుంచే ప్రారంభమైంది' - హరీశ్‌రావు తాజా వార్తలు
Minister Harishrao fires on Revanthreddy : పేద మైనార్టీల కుటుంబాలకు లక్ష రూపాయలు ఆర్థికసాయం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని.. రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడతాయని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లోని జలవిహార్ లో జరిగిన మైనార్టీల సమావేశంలో మంత్రులు హరీశ్ రావు, మహమూద్ అలీ, పలువురు ప్రజాప్రతినిధులు... మైనార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడిన మంత్రి హరీశ్‌రావు... కాంగ్రెస్ పార్టీ, రేవంత్‌ను ఉద్దేశిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని ఎద్దేవా చేసిన ఆయన... దేశంలో ఇప్పటికీ ముస్లింలు ఇంకా పేదలుగానే ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ వల్లేనని ఆరోపించారు. ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి... రాజకీయ ప్రస్థానం ఆర్‌ఎస్‌ఎస్ నుంచే ప్రారంభం అయ్యిందంటూ హరీశ్‌రావు గుర్తు చేశారు.
'ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్‌రెడ్డి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆయన సంఘ్ పరివార్‌లో పని చేశారు. రేవంత్‌రెడ్డి జీవితం సంఘ్ పరివార్‌లో ప్రారంభం అయ్యింది. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను... జవాబు చెప్పాలి. రేవంత్‌రెడ్డి జీవితం సంఘ్ పరివార్ నుంచి ప్రారంభం అయ్యిందా లేదా ?. ఏ సంఘ్ పరివార్ వారిని అడిగినా.. రేవంత్‌రెడ్డి రాజకీయ జీవితం ప్రారంభం అయ్యింది ఆర్‌ఎస్‌ఎస్ నుంచే అని చెబుతారు. ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌లో పని చేశారు. ఏబీవీపీలో పనిచేశారు. ఇప్పుడు చాలా చెబుతున్నారు. ఆయన ఎక్కడ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించారో మీరంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.' అని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.