'కేసీఆర్ టికెట్లు ఇస్తే మంచోడు, లేకుంటే చెడ్డోడా' - మల్కాజ్గిరి ప్రజా ఆశీర్వాద సభలో హరీశ్‌రావు
Published : Nov 2, 2023, 5:21 PM IST
Minister Harish Rao in Praja Ashirvada Sabha at Malkajgiri : రాహుల్‌గాంధీ రాష్ట్రానికి వచ్చి ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్లిపోతున్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో కరెంట్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి తెలిపారు. మల్కాజ్గిరి నియోజకవర్గ కేంద్రంలోని లక్ష్మీసాయి గార్డెన్స్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో హరీశ్‌రావు కార్యకర్తలు, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అంతకు ముందు ఆనంద్‌బాగ్ అంబేడ్కర్ విగ్రహం కూడలి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి ర్యాలీగా లక్ష్మిసాయి గార్డెన్‌కు చేరుకున్నారు. మైనంపల్లి స్వార్థం కోసం పార్టీ మారాడని.. ఆయన మెదక్, మల్కాజ్గిరి రెండు చోట్ల ఓడిపోవడం ఖాయమని మంత్రి స్పష్టం చేశారు.
కేసీఆర్ టికెట్లు ఇస్తే మంచోడు.. లేకుంటే చెడ్డోడా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. మర్రి రాజశేఖర్ రెడ్డి ఎంపీగా ఓడినా ప్రజాసేవా మరిచిపోలేదన్నారు. కేసీఆర్ చేతిలో తెలంగాణ ప్రశాంతంగా ఉందని.. అన్ని రంగాల్లో తెలంగాణ దేశానికి మోడల్‌గా మారిందని వివరించారు. మల్కాజ్గిరి ప్రజల కోసం సీఎం కేసీఆర్ వేయి పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తున్నారని తెలిపారు. అందులోనే 250 మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి కూడా ఉంటుందన్నారు.