కల్లు తాగిన ఎర్రబెల్లి.. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయంటూ.. - వరంగల్ న్యూస్
Minister Errabelli drinks kallu in Warangal: రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు వరంగల్ జిల్లాలో రాయపర్తి మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. అక్కడికి గీత కార్మికులు కల్లు తీసుకువచ్చి మంత్రిని తాగాల్సిందని కోరగా.. ఎర్రబెల్లి కల్లు తాగారు. అనంతరం తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.
నిత్యం అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో బిజీగా ఉండే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆత్మీయ సమ్మేళనం అనంతరం కార్యకర్తలతో కలసి సరదాగా గడిపారు. అక్కడ ప్రజలతో మాట్లాడి వారితో ఫొటోలు దిగారు. వారి కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ పాలన ఎలా ఉందో ఆరా తీశారు.
గీత కార్మికుల కోరిక మేరకు మంత్రి ఎర్రబెల్లి కల్లు తాగారు. కల్లు పోసిన వ్యక్తికి కల్లు చాలా అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చారు. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబం చేసుకునే దావత్లో కల్లు తప్పకుండా ఉంటుందని అన్నారు. తన చిన్నతనంలో తండ్రితో పొలం పనులకు వెళ్లి.. రోజంతా కష్టపడిన తర్వాత సాయంత్రం కల్లు తాగేవాళ్లమని కార్యకర్తలతో తన అనుభవాలు పంచుకున్నారు.