కూకట్‌పల్లిలో మెగా జాబ్ మేళా.. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ - Minister Srinivas Goud
Mega Job Mela at Kukatpally: తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పెద్ద పెద్ద కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నిరుద్యోగుల కోసం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు పొందిన పలువురికి ఆయన అపాయింట్మెంట్ లెటర్లు అందజేశారు. ఈ సందర్భంగా కూకట్పల్లి ప్రాంతం.. దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు నివసించే ప్రదేశం కావడంతో తన నియోజకవర్గంలో నిరుద్యోగులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే కృష్ణారావు అందరికీ ఉద్యోగాలను కల్పించాలని తెలిపారని శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వ సహాయంతో 108 కంపెనీలతో మాట్లాడి పది వేల మందికి ఉద్యోగాల ఏర్పాటు దిశగా ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రపంచ దేశాలన్నీ హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను చేసుకునేందుకు సంస్థలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు.