Manchu Manoj meet CBN: చంద్రబాబును కలిసిన మంచు మనోజ్.. రాజకీయాలపై ఏమన్నారంటే..! - మంచు మనోజ్ రాజకీయ రంగ ప్రవేశం
Manchu manoj meet TDP Pesident chandrababu: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును సినీ నటుడు మంచు మనోజ్ - మౌనిక దంపతులు సోమవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. చంద్రబాబు నివాసానికి సతీ సమేతంగా వచ్చిన మనోజ్ దంపతులు.. దాదాపు 45 నిమిషాల పాటు కుటుంబ, రాజకీయ వ్యవహారాలతో పాటు పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మనోజ్, మౌనిక రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నారంటూ ఉదయం నుంచి వార్తలు రాగా.. వాటన్నింటికీ మనోజ్ స్పష్టత ఇచ్చారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. చంద్రబాబు మా కుటుంబానికి ఎంతో సన్నిహితులు... మేమంటే ఎంతో అభిమానం అని తెలిపారు. భూమా మౌనికతో వివాహం తర్వాత ఆయన్ను కలవాలనుకున్నాం కానీ, కుదరలేదు.. ఈ లోగా బాబు కూడా కాస్త బిజీ అయ్యారు.. ‘నేను హైదరాబాద్ వచ్చినప్పుడు కలుద్దాం’ అని చెప్పారని వెల్లడించారు. ఈ రోజు ఉదయం ఫోన్ చేసి రమ్మంటే... వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశాం అని వివరించారు. మంగళవారం మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా వచ్చి ఆశీస్సులు తీసుకున్నాం.. రాజకీయాల్లోకి ప్రవేశంపై సందర్భం వచ్చినప్పుడు మౌనిక చెబుతుంది అని పేర్కొన్నారు.