గిరిజన యువకుడిపై మూత్ర విసర్జన.. వీడియో వైరల్.. సీఎం సీరియస్! - మద్యం మత్తులో వేరే వ్యక్తిపై మూత్రం పోసిన వ్యక్తి
మధ్యప్రదేశ్.. సీదీలో ఓ గిరిజన యువకుడిపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి.. పోలీసుల దృష్టికి చేరింది. దీంతో పోలీసులు గిరిజన యువకుడిపై మూత్రం పోసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనపై రాజకీయ వివాదం నెలకొంది. నిందితుడికి.. భారతీయ జనతా పార్టీతో సంబంధం ఉందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని పేర్కొంది. మరోవైపు.. నిందితుడు ప్రవేశ్ శుక్లాపై బహారీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారి ఒకరు తెలిపారు.
'సీదీ జిల్లాలో జరిగిన ఒక వైరల్ వీడియో నా దృష్టికి వచ్చింది. దోషిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను' అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. మరోవైపు.. మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. 'సీదీ జిల్లాకు చెందిన గిరిజన యువకుడిపై ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేసిన దారుణానికి సంబంధించిన వీడియో నా దృష్టికి వచ్చింది. ప్రస్తుత నాగరిక సమాజంలో ఇలాంటి హేయమైన చర్యకు చోటులేదు. నిందితుడికి బీజేపీతో సంబంధం ఉంది. ఈ ఘటన యావత్ రాష్ట్రాన్ని సిగ్గుపడేలా చేసింది. దోషులను కఠినంగా శిక్షించాలి. మధ్యప్రదేశ్‌లో గిరిజనులపై అఘాయిత్యాలను ఆపాలి' అని కమల్‌నాథ్ అన్నారు.