విరిగిపడ్డ కొండచరియలు.. 16 మంది మృతి.. సహాయక చర్యల్లో సీఎం - maharashtra landslide exgratia
Maharashtra Landslide Incident : మహారాష్ట్ర.. రాయ్‌గఢ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 16 మంది మృతిచెందారు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో.. దాదాపు 21 మంది గాయపడ్డారు. శిథిలాల కింద సుమారు దాదాపు 17 కుటుంబాలకు చెందిన 100 మంది చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన ఖలాపుర్ మండలంలోని ఇర్షాల్‌వాడి అనే గ్రామంలో జరిగింది.
Raigad Landslide : కొండచరియలు విరిగిపడ్డ ఘటనపై సమాచారం అందుకున్న రెస్యూ బృందాలు.. ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని నవీ ముంబయిలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు మంత్రి ఉదయ్ సమంత్ తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని ట్రెక్కర్ల బృందాలను జిల్లా యంత్రాంగం కోరింది. హుటాహుటిన ఘటనాస్థలాన్ని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే చేరుకుని సందర్శించారు.
మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటన
ఈ ఘటనలోమృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ముఖ్యమంత్రి శిందే ప్రకటించారు. క్షతగాత్రులకు ఉచిత వైద్యం అందజేస్తామని, సహాయక చర్యల కోసం రెండు హెలికాప్టర్లను రంగంలోకి దించామని తెలిపారు.
శిందేకు అమిత్ షా ఫోన్..
ఈ ఘటనపై సీఎం ఏక్‌నాథ్ శిందేతో ఫోన్లో మాట్లాడానని.. 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని స్థానిక యంత్రాంగంతో కలిసి సహాయక చర్యలు చేపడుతున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ప్రజలను రక్షించడం, క్షతగాత్రులకు తక్షణ వైద్య సహాయం అందించడమే తమ పని అని ఆయన తెలిపారు.
ఫైర్ అధికారి మృతి..
రాయ్‌గఢ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతంలో సహాయక చర్యల్లో పాల్గొనేందుకు వెళ్తుండగా నవీ ముంబయి పౌర సంస్థకు చెందిన అగ్నిమాపక అధికారి శివరామ్ గుండెపోటుతో మృతి చెందారు.