దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తే నష్టపోయేది మీరే : కేటీఆర్
Published : Nov 12, 2023, 12:44 PM IST
KTR visits Guvvala Balaraju in Hospital: అర్ధరాత్రి నాగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో గాయాలపాలైన బీఆర్ఎస్ అభ్యర్థి గువ్వల బాలరాజును మంత్రి కేటీఆర్(KTR) పరామర్శించారు. హైదరాబాద్లోని ఆస్పత్రిలో ఉన్న బాలరాజును కలిసి దాడి జరిగేందుకు గల కారణాలను తెలుసుకున్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఎన్నికల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్(BRS) ప్రభుత్వమేనని.. దాడుల సంస్కృతిని ప్రోత్సహిస్తే నష్టపోయేది మీరేనని హెచ్చరించారు. ఇంతకింత అనుభవించాల్సి వస్తుందని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనని పేర్కొన్నారు. గువ్వల బాలరాజుకు భద్రత పెంచాలని డీజీపీని కోరారు.
Congress BRS Leaders Conflict in Nagarkurnool : అచ్చంపేటలోని ఓ కారును కాంగ్రెస్(Congress) పార్టీ కార్యకర్తలు అడ్డుకుని.. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజు డబ్బులు తరలిస్తున్నారని ఆరోపించారు. దీంతో కారుపై రాళ్ల దాడి చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలతో వాగ్వాదం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధులు అక్కడికి చేరుకున్నారు. అనంతరం కార్యకర్తలు నినాదాలు చేస్తూ.. మళ్లీ ఘర్షణకు దిగారు. ఈ దాడిలో ఎమ్మెల్యే బాలరాజుకు స్వల్పగాయాలైయ్యాయి. స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన తరవాత.. హైదరాబాద్లోని ఆస్పత్రికి తరలించారు.