కాంగ్రెస్ వస్తే తెచ్చేది భూమాతనా? భూ‘మేత’నా? : కేసీఆర్ - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023
Published : Nov 20, 2023, 6:49 PM IST
KCR Praja Ashirvada Sabha Meeting at Nalgonda : రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరని ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాశక్తి ముందు ఎవరూ నిలువలేరన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ సభ అనంతరం, నకిరేకల్, నల్గొండ మర్రిగూడ బైపాస్‌లో ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ధరణిని బంగాళాఖాతంలో కలిపి, భూమాత తెస్తామని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని.. కాంగ్రెస్ వస్తే తెచ్చేది భూమాతనా? భూ‘మేత’నా? అని ప్రశ్నించారు. ధరణి పోర్టల్ బంద్ చేస్తే రైతు బంధు నిధులు ఎలా వస్తాయన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ జిల్లాను తానే దత్తతకు తీసుకొని.. అభివృద్ధి బాటలో పరుగులు పెట్టించినట్లు కేసీఆర్ వివరించారు. అంతేకాదని దత్తత ఇంకా తన పరిధిలోనే ఉందని.. ఇప్పుడు జరిగిన దానికంటే రెట్టింపు అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. యాభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క మెడికల్ కళాశాల నిర్మాణం జరగలేదని.. నేడు మూడు కాలేజీలకు బీఆర్ఎస్ విస్తరించిందని వివరించారు. ఈసారి కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తేనే.. తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనా ఫలాలు అందరికీ అందుతాయని అన్నారు. కళ్లబొల్లి మాటలు విని ఆగమైతే నష్టపోయేది మీరేనని కేసీఆర్ సూచించారు.