ఫ్లై ఓవర్ కింద ప్లే గ్రౌండ్.. ఐడియా అదిరింది గురూ
Play ground under Flyover : సోషల్ మీడియా వల్ల ఎన్ని నష్టాలున్నా.. లాభాలు మాత్రం ఎక్కువే. ఎక్కడెక్కడున్న వారినో కలిపేస్తోంది. ఎక్కడెక్కడి విషయాలను మనకు చేరవేస్తుంది. మనకు తెలియని వింతలు విశేషాలను అరచేతిలో చూపిస్తోంది. కొన్నిసార్లు ఇన్నోవేటివ్ ఐడియాలను మనకు చేరవేస్తుంది. అలా సోషల్ మీడియాలో ఓ ఐడియా రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు చేరింది.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలన్నా.. రాష్ట్రంలో ప్రతిపక్షాలను విమర్శించాలన్నా.. వారి విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలన్నా.. సాయం చేయమని కోరిన ఎవరికైనా వెంటనే సాయం అందాలన్నా.. ఏదైనా ఐడియా గురించి షేర్ చేసుకోవాలన్నా కేటీఆర్ ఎక్కువగా ఉపయోగించేది ట్విటర్. ట్విటర్‌లో కేటీఆర్ చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా కేటీఆర్ దృష్టికి ఓ వినూత్న ఐడియా వచ్చింది. మరి అదేంటో ఓసారి చూద్దామా..?
నగరాల్లో ఫ్లై ఓవర్‌లు కట్టిన తర్వాత కింద స్థలం కొన్నిచోట్ల పార్కింగ్‌కు ఉపయోగిస్తున్నారు. మరికొన్ని చోట్ల ఫెన్సింగ్ కట్టేసి పూలమొక్కలు పెంచుతున్నారు. అయితే ఇలా కాకుండా ఫ్లై ఓవర్ కింద స్థలాన్ని ప్లే గ్రౌండ్‌గా మారిస్తే..? ఈ ఐడియాను ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ముంబయిలో అచ్చం ఇలా ఫ్లై ఓవర్ కింద స్థలాన్ని గ్రౌండ్‌గా మార్చి.. క్రికెట్, బాస్కెట్ బాల్ ఆడుతున్న వీడియోను షేర్ చేశాడు. దీనివల్ల ఆట స్థలాల కొరత అధిగమించవచ్చని ధనుంజయ్ అనే వ్యక్తి ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.
ఈ వీడియో కాస్త కేటీఆర్ దృష్టిలోకి వచ్చింది. వెంటనే స్పందించిన మంత్రి.. 'ఇంది మంచి ఆలోచన. ఈ విధానం మన హైదరాబాద్‌లోనూ పలు ప్రాంతాల్లో పరిశీలించాలి' అని పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్‌కు ట్వీట్ చేశారు. జంటనగరాల్లో ఈ తరహా క్రీడా వేదికలను అందుబాటులో తేవచ్చని కేటీఆర్ పేర్కొన్నారు.