International Yoga Day 2023 : ఒకేసారి 1.53లక్షల మందితో యోగా.. సూరత్ గిన్నిస్ రికార్డ్ - సూరత్ రికార్డ్
గుజరాత్ సూరత్‌కు చెందిన 1.53లక్షల మంది ఒకేసారి యోగా చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ వేడుకను నిర్వహించారు. 'ఒకేచోట అతిపెద్ద యోగా సెషన్'గా రికార్డ్ సృష్టించినట్లు గిన్నిస్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో పాటు మంత్రులు హాజరయ్యారు. అంతకుముందు ఈ రికార్డు రాజస్థాన్‌లోని కోటా నగరం పేరిట ఉండేంది. 2018లో 1,00,984 మంది ఒకేసారి యోగా చేసి గిన్నిస్ రికార్డు సృష్టించారు.
"ఈ యోగా సెషన్‌కు 1.25 లక్షల మంది వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ 1.53 లక్షల మంది వచ్చారని గిన్నిస్ ప్రతినిధులు ధ్రువీకరించారు. 10 కిలోమీటర్ల పొడవైన రోడ్డుపై ఇరువైపులా 1.53లక్షల మంది యోగా చేశారు. 135 బ్లాకులుగా విడగొట్టి.. సుమారు 1,000 మంది ప్రజలు యోగా చేశారు. " అని సూరత్ మున్సిపల్ అధికారులు తెలిపారు. కార్యక్రమం అనంతరం గిన్నిస్ ధ్రువీకరణ పత్రాన్ని సీఎం భూపేంద్ర పటేల్‌కు అందజేశారు ప్రతినిధులు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. రాష్ట్రంలో 21 యోగా స్టూడియోలు ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.