Manchireddy Kishan Reddy on Masab pond : 'మాసాబ్ చెరువు ఆక్రమణలు.. నిందితులు ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదు' - water ponds in Hyderabad Ponds
Manchireddy Kishan Reddy angry on occupation of Masab pond : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో తుర్కయంజాల్‌లోని మాసాబ్ చెరువు ఆక్రమాణలపై ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు ఆక్రమాణలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా విడిచి పెట్టేది లేదని స్పష్టం చేశారు. మాసాబ్ చెరువును కాపాడేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. చెరువు ప్రాంతంలోని సర్వే నెంబర్లు 205, 137లో మట్టి నింపిన ప్రాంతాలను ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి కిషన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
చెరువులో పెద్ద ఎత్తున అక్రమంగా మట్టిని డంప్ చేస్తుంటే ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. హెచ్‌ఎండీఏ అధికారులు మంగళవారం చెరువు పరిశీలనకు వస్తారని.. ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో వ్యహరించి చెరువును పరిరక్షించేందుకు చొరవ తీసుకోవాలని సూచించారు. నాగార్జున సాగర్ రహదారికి పక్కనే చెరువు ఉండటంతో కబ్జాకోరుల కన్ను చెరువుపై పడిందని మండిపడ్డారు. సర్వే నెంబర్ 137లో రోడ్డు కోసం పెద్ద ఎత్తున మట్టిని నింపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు, ఇరిగేషన్ అధికారులకు సూచించారు. మట్టిని నింపిన వారే.. తిరిగి తీసే విధంగా చర్యలు తీసుకోవాలని.. దానికి అయ్యే ఖర్చు మొత్తం వారే భరించేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ ఛైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, సీనియర్ నాయకులు కందాడ లక్ష్మారెడ్డి, మాసబ్ చెరువు పరిరక్షణ సమితి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.