రెచ్చిపోతున్న పోకిరీలు.. బైక్‌లతో రోడ్లపై ప్రమాదకర స్టంట్లు - హైదరాబాద్‌లో ప్రమాదకరంగా బైక్ నడుపుతున్న యువకులు
hyderabad youth dangerous bike Stunts : ఈ మధ్య కాలంలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో యువకులు రకరకాల స్టంట్లు చేస్తున్నారు. ప్రాణాలను లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నారు. కొన్నిసార్లు పక్కవారి ప్రాణాలతోనూ చెలగాటం ఆడుతున్నారు. రద్దీగా ఉండే రహదారులపై బైక్‌లతో స్టంట్స్ చేస్తూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ మలక్‌పేట, చంచల్‌గూడా ప్రాంతాల్లో పోకిరీలు బైక్ రేసింగ్‌లతో రెచ్చిపోతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా రోడ్లపై ప్రమాదకరమైన బైక్ రేసింగ్‌లు, స్టంట్లు చేస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. రోడ్లపై అతి వేగంగా బైకులు నడుపుతూ పక్కవారిని హడలెత్తిస్తున్నారు. యువకుల అతి చేష్టలతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. యువకులు నిత్యం రోడ్డుపై హంగామా సృష్టిస్తున్నా.. ట్రాఫిక్ పోలీసులు కేవలం చలాన్లకే పరిమితం అవుతుండటం పట్ల పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. తమ ప్రాణాలతో పాటు పక్కవారి జీవితాలతో చెలగాటం ఆడే ఇలాంటి ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని, రోడ్లపై ఇలాంటివి జరగకుండా చూడాలని కోరుతున్నారు.