హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్యాకు అస్వస్థత - అపోలో ఆసుపత్రిలో చేరిన హైదరాబాద్ సీపీ
Published : Nov 20, 2023, 7:19 PM IST
Hyderabad CP Sandeep Shandilya at Apollo Hospital :హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) సందీప్ శాండిల్యా అస్వస్థతకు గురయ్యారు. హైదర్‌గూడలోని పాత కమిషనరేట్ కార్యాలయంలో ఉండగా సందీప్ శాండిల్యా ఛాతీనొప్పితో ఇబ్బంది పడ్డారు. దీంతో ఆయనను అధికారులు హైదర్ గూడలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆయనకు గుండె పోటు వచ్చిందని వార్తలు రావడంతో.. తాను సురక్షితంగా ఉన్నట్లు సెల్ఫీ వీడియోను సీపీ విడుదల చేశారు.
మగతగా ఉండటంతో ఆస్పత్రికి వచ్చానని.. తనకు తీవ్ర స్పాండిలైటిస్, రక్తపోటు సమస్య ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం వైద్యం చేయించుకుంటున్నానని సీపీ వివరించారు. ఇవాళ వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారని.. రేపు యథావిధిగా విధులు నిర్వహిస్తానని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో సందీప్ శాండిల్యాను సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తనిఖీల పరంగా సీపీ నగరంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ దిశానిర్దేశం చేస్తున్నారు.