Husband Built Temple For Wife : భార్య కోసం గుడి నిర్మించిన భర్త.. అక్కడే ఉంటూ రోజూ పూజలు.. - భార్య జ్ఞాపకార్థం గుడి కట్టిన భర్త
Husband Built Temple For Wife In Uttar Pradesh : చనిపోయిన భార్య కోసం ఓ వ్యక్తి ఆలయం నిర్మించాడు. ప్రతిరోజు సాయంత్రం ఆమెకు పూజలు నిర్వహిస్తూ అక్కడే ఉంటున్నాడు. తన భార్య బతికి ఉన్నప్పుడు తనకు తోడునీడగా ఉండేదని.. ఇప్పుడు తాను కూడా జీవితాంతం ఆమెకు తోడుగా ఉంటానని చెబుతున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఆ వ్యక్తి కథ ఇదే.
ఇదీ జరిగింది..
ఫతేపుర్ జిల్లా.. బకేవర్ ప్రాంతంలోని పధారా గ్రామానికి చెందిన వ్యక్తి రామ్ సేవక్. అతడికి 1977 మే 18న రూప అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. రామ్ సేవక్ సర్వేయర్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు. అయితే కరోనా సమయంలో 2020 మే 18న రామ్ సేవక్ భార్య చనిపోయింది. భార్య మరణాన్ని తట్టుకోలేని రామ్ సేవక్.. ఆమె జ్ఞాపకార్థం తన ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో గుడి నిర్మించాడు. గుడిలో రోజూ సాయంత్రం పూజలు నిర్వహిస్తూ అక్కడే ఉంటున్నాడు. అయితే భార్య కోసం గుడి నిర్మిస్తున్నప్పుడు గ్రామస్థులు రామ్సేవక్ను ఎగతాళి చేసేవారు. కానీ ఇప్పుడు అంతా మామూలైపోయింది.
ఎన్ని కష్టాల్లో ఉన్నా.. తనను నిరాశలో తన భార్య మునిగిపోనివ్వలేదని రామ్‌సేవక్ గుర్తుచేసుకున్నాడు. తన భార్య చనిపోయాక.. ఆమెను మరిచిపోయేందుకు చాలా ప్రయత్నాలు చేశానని.. అయినా తన వల్ల కావడంలేదని తెలిపాడు. ఆమె బతికి ఉన్నంతకాలం తనకు తోడునీడలా ఉండేదని చెప్పాడు. ఇప్పుడు నేను నిర్మించిన ఆలయంలో ఉంటే ఆమె తనతోనే ఉన్నట్టు అనిపిస్తుందని అన్నాడు. ఆమే.. తన సర్వస్వం అని.. జీవితాంతం తన జ్ఞాపకాలతో గడపాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.