పేకమేడల్లా కూలిన ఇళ్లు.. శిమ్లాలో కొండచరియల విధ్వంసం.. ఇద్దరు మృతి - హిమాచల్ ప్రదేశ్ వరదలు లేటెస్ట్ అప్డేట్
Himachal Pradesh Shimla Landslide : హిమాచల్‌ప్రదేశ్‌లోని శిమ్లాలో భారీ వర్షాల ధాటికి కొండచరియలు విరిగి పడుతున్నాయి. శిమ్లాలోని కృష్ణ నగర్ ప్రాంతంలో అనేక ఇళ్లు పేకమేడల్లా కుప్పకూలాయి. కొండచరియలు కదలడం వల్ల మొదట ఓ భారీ వృక్షం కూలిపోయింది. వెంటనే అక్కడ ఉన్న మున్సిపల్ వధశాల సహా ఇళ్లన్నీ ఒక్కసారిగా కుప్పకూలాయి. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సుఖు సైతం ఘటనా స్థలిని పరిశీలించారు.
"ఇద్దరు మృతి చెందినట్లు నిర్ధరణ అయింది. ఒక మృతదేహాన్ని శిథిలాల నుంచి బయటకు తీశారు. ఇంకోటి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, శిమ్లా మున్సిపల్ కార్పొరేషన్ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టడం వల్ల అనేక మంది ప్రాణాలు కాపాడినట్లైంది. ఇళ్లకు పగుళ్లు రాగానే అక్కడ నివాసం ఉంటున్నవారిని అధికారులు వేరే చోటికి తరలించారు" అని సీఎం సుఖు తెలిపారు.
కాగా, రాష్ట్రంలో వర్షాల కారణంగా సంభవించిన మరణాల సంఖ్య 56కు చేరినట్లు అధికారులు తెలిపారు. శిమ్లాలో శివాలయం శిథిలాల కింది నుంచి మరో మృతదేహం వెలికి తీయగా.. కృష్ణ నగర్లో ఇద్దరు చనిపోయినట్లు వివరించారు.