హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం.. చిక్కుకుంటే ఇక పద్మవ్యూహమే - హైదరాబాద్‌లో జరగనున్న ఈ ఫార్ములా రేస్
Heavy Traffic Jam Due To E- Formula Race: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. కేవలం అర కిలోమీటరు దూరం ప్రయాణించడానికి దాదాపు గంట సమయం పడుతోంది. ప్రధానంగా ఖైరతాబాద్ కూడలి ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంది. కీలకమైన ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించడంతో గంటల కొద్దీ వాహనదారులు రోడ్లపైనే ఉండిపోవాల్సి వస్తోంది. ట్యాంక్‌బండ్‌పై ఈ నెల 11వ తేదీన ఫార్ములా ఈ-రేసింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి వెళ్లే మార్గాలను మూసివేశారు
ఖైరతాబాద్ బస్తీల నుంచి ఖైరతాబాద్ ప్రధాన రహదారికి వెళ్లాలంటే రైల్వే గేటు ఉంది. ఈ గేటు సమీపంలో నివాసం ఉండే వారు మింట్‌కాంపౌండ్, నెక్లెస్ రోటరీ, ఫ్లైఓవర్ మీదుగా తిరిగి వెళ్తుంటారు. మింట్‌కాంపౌండ్ దారిని సచివాలయం కోసం రోడ్డు వేస్తూ కొద్ది రోజులుగా పూర్తిగా మూసేశారు. ఐమ్యాక్స్ దారి కూడా మూతపడడంతో అత్యవసర పరిస్థితి ఏర్పడితే తమకు నరకమేనని బస్తీవాసులు వాపోతున్నారు.
పంజాగుట్ట నుంచి ఖైరతాబాద్ మీదుగా అబిడ్స్ వెళ్లేందుకు సాధారణంగా పావుగంట సమయం పడుతుంది. ప్రస్తుతం గంట సమయం పడుతోందని వాహనదారులు వాపోతున్నారు. షాదన్ కాలేజీ దగ్గర యూటర్న్ మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖైరతాబాద్ ట్రాఫిక్ ప్రభావం మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్ తదితర ప్రాంతాలపైనా పడింది. సికింద్రాబాద్ నుంచి లక్డీకాపూల్, మెహిదీపట్నం, అత్తాపూర్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేసుల కారణంగా సాధారణ ట్రాఫిక్‌ను అనుమతించకపోవడంతో ఐమ్యాక్స్‌లో సినిమా ప్రదర్శనలు రద్దయ్యాయి. అక్కడే ఉండే ప్యారడైజ్ హోటల్‌ను తాత్కాలికంగా మూసేశారు. ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కులను మూసేశారు.