Ambedkar statue: అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు రమ్మని ఆహ్వానం రాలేదు: తమిళిసై - Tamilisai said that Telangana government
Tamili Sai on Ambedkar statue: మహిళల హక్కుల సాధికారత కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ లాంటి మహోన్నత వ్యక్తి విగ్రహావిష్కరణకు.. ఒక మహిళ గవర్నర్‌గా తనకు ఆహ్వానం రాకపోవడం ఆశ్చర్యంగా ఉందని గవర్నర్ తమిళ్ సై సౌందర రాజన్ అన్నారు. విగ్రహావిష్కరణకు తనకు ఎలాంటి పిలుపు అందలేదని తెలిపారు. ఒక వేళ ఆహ్వానం వచ్చి ఉంటే కచ్చితంగా వెళ్లేదాన్ని అని తమిళ్ సై స్పష్టం చేశారు. ఆహ్వానం రానందున.. రాజ్ భవన్‌లోనే నివాళులు అర్పించాల్సి వచ్చిందన్నారు. స్వాతంత్య్ర సమరంలో ఎంతో కృషి చేసిన విజ్ఞాన వేత్తల జీవిత గాధలను ప్రజల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో విజ్ఞాన భారతి సభ్యులు రచించిన పుస్తకాన్ని తమిళి సై ఆవిష్కరించారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఐసీఎంఆర్)లో జరిగిన కార్యక్రమంలో విజ్ఞాన భారతి సభ్యలు, శాస్త్రవేత్తలతో కలిసి ఆమె పాల్గొన్నారు. స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో భారతీయ శాస్త్రవేత్తలు తమ వంతు అందించిన సహకారాన్ని పుస్తకంలో వివరించినట్లు ఆమె పేర్కొన్నారు.