Child Died Due to Peanut Seed in Satyasai District: అయ్యో పాపం.. పాప ప్రాణం తీసిన వేరు శనగ గింజ - సత్యసాయి జిల్లాలో విషాదం
Child Died Due to Peanut Seed in Satyasai District: శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది. కదిరిలో వేరు శనగ విత్తనం గొంతులో ఇరుక్కుని ఊపిరాడక రెండు సంవత్సరాల చిన్నారి మృతి చెందింది. నయన శ్రీ మృతి చెందిన తీరు గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కర్ణాటకలోని బాగేపల్లి తాలూకా వసంతపూర్కు చెందిన నయన శ్రీ తండ్రి హనుమంతు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలోని బంధువుల ఇంటికి వచ్చారు. ఆడుకుంటూ సందడి చేస్తున్న చిన్నారి.. వేరు శనగ విత్తనం తినేందుకు ప్రయత్నించింది. విత్తనం గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక విలవిల్లాడింది. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు.. కదిరిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిందిగా వైద్యులు సూచించారు. పరీక్షించిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఊపిరాడక చిన్నారి అప్పటికే మరణించినట్లు తెలిపారు. నయనశ్రీ అకస్మాత్తుగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలతో ఆసుపత్రికి వచ్చినవారు రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది.