Kalwala Project in Karimnagar : కల్వల ప్రాజెక్టుకు గండి.. దిగువకు భారీగా వరద నీరు.. ఆ ప్రాంతాలకు అలర్ట్ - తెలంగాణ న్యూస్
Gandi for Kalwala project Video: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రముఖ ప్రాజెక్టులు వరద తాకిడిని తట్టుకోలేకపోతున్నాయి. గురువారం కడెం ప్రాజెక్టు పైనుంచి నీరు ప్రవహించింది. ఇవాళ తాజాగా కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కల్వల ప్రాజెక్టుకు గండి పడింది. గత రెండు రోజులుగా కురిసిన వర్షానికి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. గురువారం సాయంత్రం ప్రాజెక్టుకు ఓవైపు కట్ట స్వల్పంగా కోతకు గురైంది. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే, పలు శాఖల అధికారులు ప్రాజెక్టు వద్దకు చేరుకొని పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు రాకూడదని ఇసుకను నింపిన బస్తాలను కోతకు గురైన ప్రాంతంలో వేశారు. శుక్రవారం ప్రాజెక్టు మత్తడి వద్ద కట్టకు గండి పడింది. దిగువ ప్రాంతానికి భారీగా వరద నీరు ప్రవాహం సాగుతుంది. ఈ నీరు వీణవంక, వీణవంక మండలంలోని బ్రాహ్మణపల్లి, మల్లన్నపల్లి, రామక్రిష్ణాపూర్, లస్మక్కపల్లి, పోతిరెడ్డిపల్లి, జమ్మికుంట మండలం కాపులపల్లి, విలాసాగర్ గ్రామాలకు చేరే అవకాశం ఉంది. ఈ గ్రామానికి చెందిన గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అటువైపుగా ఎవరు వెళ్లకుండా పోలీసులు తగు రక్షణ చర్యలు చేపడుతున్నారు.