గుప్తనిధి పేరుతో గొర్రెల వ్యాపారులకు టోకరా - రూ.2 కోట్ల ఆశ చూపించి రూ.40 లక్షలు స్వాహా - గుప్త నిధుల పేరుతో మోసం
Published : Dec 21, 2023, 1:45 PM IST
|Updated : Dec 21, 2023, 3:07 PM IST
Fraud in the name of Gupta Nidhi : గుప్త నిధుల పేరుతో ముగ్గురు వ్యాపారులను బురిడీ కొట్టించిన ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. గుప్త నిధులిస్తామని తమ నుంచి 40 లక్షలు తీసుకున్న ముఠా 2 కోట్ల రూపాయల నకిలీ నగదును అప్పగించారని సూర్యాపేటకు చెందిన మేకల వ్యాపారులు వాపోయారు. మోసపోయిన వ్యాపారులు పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన పోలీసులు అనిసెట్టిపల్లి వద్ద ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం :సూర్యాపేటకు చెందిన మేకల వ్యాపారులు బోయిన బుచ్చయ్య, కిరణ్, లింగయ్యలు మేకలు కొనుగోలు చేస్తూ సంతల్లో విక్రయం చేస్తుంటారు. తిరువూరుకు చెందిన మానికల కృష్ణ గ్యాంగ్ ఆ ముగ్గురిని సంప్రదించి మేకల గుంపు విక్రయం పేరుతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు రప్పించింది. అనంతరం ‘గుప్త నిధుల ద్వారా వచ్చిన రూ.2 కోట్ల విలువైన నగదు’ తమ వద్ద ఉందని చెప్పింది. పూజలు చేసి డబ్బు సంచులను పక్కన పెట్టామని, తాము ముట్టుకొంటే ప్రమాదమని కథలు అల్లారు.
తమ వద్ద ఉన్న డబ్బు ఇచ్చి ఆ రెండు కోట్ల నగదు ఉన్న సంచులు తీసుకోమని గొర్రెల వ్యాపారులను నమ్మించారు. ప్రలోభానికి గురైన గొర్రెల వ్యాపారులు తమ వద్దనున్న రూ.40 లక్షలు ముఠాకు అప్పగించి వారు పూజ చేసి పక్కన ఉంచిన నగదు సంచులు తీసుకున్నారు. అదే సమయంలో నిందితులు నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నారు.
ఆ తర్వాత గొర్రెల వ్యాపారుల ఆ సంచులు తెరిచి చూస్తే అందులో నకిలీ నోట్లు కనిపించాయి మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు .వారి నుంచి రూ.30.46 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఇంకో ముగ్గురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. గుప్త నిధులంటూ మాయ మాటలు చెప్పిన వారిని నమ్మి మోసపోకూడదని ప్రజలకు పోలీసులు సూచించారు.