Fire Accident At Begum Bazar : హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం.. టెంట్‌హౌజ్‌లో చెలరేగిన మంటలు - Fire accident near Karachi Bakery
Fire Accident in Tent House at Begum Bazar : హైదరాబాద్‌లో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బేగంబజార్‌లోని కరాచీ బేకరీ సమీపంలో ఓ టెంట్ హౌజ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికుల కథనం ప్రకారం.. బేగంబజార్ పరిధిలోని అమర్ టెంట్‌హౌజ్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అందులో పని చేస్తున్న సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఆ తరువాత అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరకున్నారు. నాలుగు అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు.
ప్రమాదంలో గోదాంలో ఉన్న టెంట్ సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యింది. ప్రమాదంలో ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు. చుట్టు పక్కల వారు, గోదాంలో పని చేసే వారు అప్రమత్తంగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. దీనిపై దుకాణ యజమాని స్పందించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. గోదాంలో సుమారు రూ. 60 లక్షల విలువ చేసే సామగ్రి అగ్నికి ఆహుతి అయినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.