Fire accident : జగిత్యాల జిల్లాలో అగ్ని ప్రమాదం.. 400 వరకు దగ్ధమైన తాటి, ఈత చెట్లు - palm trees caught in fire
Fire accident in Jagtial district : వేసవి వచ్చిందంటే చాలు అగ్నిప్రమాదాలు భయపెడుతూ ఉంటాయి. చిన్న అగ్గిరవ్వ పెను ప్రమాదానికి దారి తీస్తుంది. కొన్ని సార్లు ఇతరుల నిర్లక్షం భారీ ప్రమాదాలకు గురి చేస్తుంది. ఈ ప్రమాదాల వల్ల ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. వీటిపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు అధికారులు సూచిస్తూనే ఉన్నారు. తాజాగా జగిత్యాల జిల్లాలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
జిల్లాలోని భీమారం మండలం కమ్మరిపేటలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. మంటల ప్రభావానికి చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఈ ఘటనలో 400 వరకు ఈత, తాటి చెట్లు కాలిపోయాయి. దీంతో గీతకార్మికుల ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. కుల వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నామని ఇప్పుడు చెట్లు కాలిపోవటంతో జీవన ఉపాధి కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయం చేయాలని కోరారు.