Fire accident: వెంటాడుతున్న అగ్నిప్రమాదాలు.. ఈసారి శానిటైజర్ గోదాంలో.. - Hyderabad Latest News
Fire accident: భాగ్యనగరాన్ని వరుస అగ్నిప్రమాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా పేట్ బషీరాబాద్‌లోని కండ్లకోయ వద్ద శానిటైజర్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. గ్రీన్ వేస్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట ఉన్న శానిటైజర్ గోదాంలో.. నిలువ ఉన్న అట్టలకు నిప్పు అంటుకోవడంతో అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు అగ్నిమాపక శకటాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే గత కొంత కాలంగా గోదాం తెరవడం లేదని సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు.
బైక్ షోరూంలో.. హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఊటపల్లి వద్ద శనివారం ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఫైర్ ఇంజిన్‌ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఘటనలో ఐదు బైకులు అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకుని ఉండొచ్చని అగ్నిమాపక శాఖ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.