కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఘర్షణ - పరస్పరం కార్యకర్తల దాడి - కూకట్పల్లిలో కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు
Published : Nov 6, 2023, 5:05 PM IST
Fight Between Congress Activists in kukatpally : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచారాలను ముమ్మరం చేశాయి. అభ్యర్థులు, అభ్యర్థిత్వాలు ఖరారైన నేతలు ఇంటింటి ప్రచారాలు, సభలు నిర్వహిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలుచోట్ల ఆయా పార్టీల్లో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. తాజాగా కూకట్పల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
స్థానిక అభ్యర్థి బండి రమేశ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా గొడవ చెలరేగింది. భోజనాల వద్ద ప్రారంభమైన చిన్న గొడవ.. చినికి చినికి చివరకు తలలు పగులగొట్టుకునే వరకు వెళ్లింది. బాలాజీ నగర్ డివిజన్, బోయిన్పల్లి డివిజన్ కార్యకర్తలు భోజనం కోసం లైన్లో నిలబడే క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న టేబుళ్లతో కొట్టుకున్నారు. ఘర్షణలో పలువురికి గాయాలయ్యాయి. చివరకు అక్కడే ఉన్న పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.