Etela Meets Regional Ring Road Victims : 'కిసాన్ సర్కార్ అంటూ.. రైతులకు సంకెళ్లు వేస్తారా?' - yadadri bhuvanagiri latest news
Etela Supports Yadadri Regional Ring Road Victims : సీఎం కేసీఆర్.. పేదల భూములు గుంజుకొని పెద్ద మనుషులకు ఇస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. రైతులకు సంకెళ్లు వేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని హెచ్చరించారు. ప్రభుత్వమే భూముల విక్రయాలు జరిపే బ్రోకర్ల మాదిరిగా తయారైందని ఆయన విమర్శించారు. యాదాద్రి జిల్లాలో రీజినల్ రింగు రోడ్డు భూబాధితులను ఈటల రాజేందర్ కలిశారు. చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు లేక భూములనే నమ్ముకుని బతుకుతున్నారని.. భూమిని కోల్పోతే వారు కూలీలుగా మిగిలి పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. గజ్వేల్లో వేల ఎకరాల పేదల భూములను గుంజుకొని కంపెనీలకు ధారాదత్తం చేశారని కేసీఆర్పై ఈటల ఆరోపణలు చేశారు. ధరణి వల్ల అమ్ముకున్న భూములను మళ్లీ రికార్డులకు ఎక్కిస్తానన్నారని చెప్పారు. భువనగిరిలో ఇటీవల రైతులను అరెస్టు చేసి, సంకెళ్లు వేసిన ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కిసాన్ సర్కార్ అని చెబుతూ రైతులకు బేడీలు వేస్తారా అని ఈటల ప్రశ్నించారు. చాలీచాలని పరిహారంతో కోట్ల రూపాయల విలువైన భూములు లాక్కునే అధికారం ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు.