యాదాద్రిలో డ్రోన్ కలకలం.. పోలీసుల అదుపులో ఇద్దరు యువకులు
Drone Commotion in Yadadri Temple: యాదాద్రి కొండపై డ్రోన్ కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిన్న రాత్రి దేవాలయంపై డ్రోన్ చక్కర్లు కొట్టడాన్ని పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలోనే శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని డ్రోన్ ద్వారా చిత్రీకరిస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. కొండపై, ఆలయ పరిసరాలను ఎలాంటి అనుమతులు లేకుండా వారు చిత్రీకరిస్తున్నారని విచారణలో తేలింది. వారు హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన సాయికిరణ్, జాన్లని తెలిపారు.
మరోవైపు శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి అనుబంధ శివాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. పెళ్లికొడుకు, పెళ్లికూతురు వేషధారణలో, వజ్రవైఢూర్యాలతో సీతారాములు ధగధగ మెరిసిపోయారు. కల్యాణ ఘడియ సమీపించగానే సీతమ్మవారి మెడలో శ్రీరాముడు మాంగళ్యధారణ గావించారు. లోకకల్యాణం కోసం ఇరువురు ఆదర్శ దంపతులుగా వర్ధిల్లారని వేదపండితులు ప్రవచించారు. దేవదేవుడి కల్యాణవైభోగాన్ని.. కనులారా వీక్షించి భక్తజనం పులకించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ, తలంబ్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ గీత, తదితరులు పాల్గొన్నారు.