కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా కాళేశ్వరం అవినీతిపై చర్యలేవీ : డీకే అరుణ - dk aruna on congress
Published : Jan 7, 2024, 2:27 PM IST
DK Aruna On Kaleshwaram :కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ అంటూ కాంగ్రెస్ ప్రభుత‌్వం కాలయాపన చేసే యోచన కనిపిస్తోందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. కాళేశ్వరం విషయంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీబీఐ రాష్ట్రంలోకి రాకుండా గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెంటనే రద్దు చేయాలన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
మేడిగడ్డ బ్యారేజీ కుంగడం, అన్నారం పంపులు మునగడం, ప్రాజెక్టు డిజైన్ లోపం, నాణ్యత లోపమే కారణమని డీకే అరుణ ఆరోపించారు. ఈ క్రమంలోనే కేంద్రం నిధులు ఇస్తుందనే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఇచ్చిందా అని ప్రశ్నించారు. హస్తం పార్టీ ప్రజా పాలనకు వంద రోజుల సమయం అడిగారని, ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తప్పకుండా వస్తాయని పేర్కొన్నారు. గతంలో కూడా పెద్ద ఎత్తున కేంద్రం నిధులు ఇచ్చిందని డీకే అరుణ గుర్తు చేశారు.