గర్భగుడిపై కోడిపిల్లలు విసిరిన భక్తులు.. అలా చేస్తే కోరికలు తీరతాయట! - కర్ణాటక భక్తుల విశ్వాసం
కర్ణాటకలోని ఓ దేవాలయంలో గర్భగుడిపై కోడి పిల్లలను విసిరే సంప్రదాయం ఉంది. ఆ దేవాలయానికి వచ్చే భక్తులు తమ వెంట కోడిపిల్లలను తీసుకువస్తారు. వాటినే గర్భగుడిపై విసురుతారు. భక్తులు ఎందుకు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారో తెలుసా?
బెళగావి జిల్లాలోని వడగావి గ్రామంలో ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే మంగళవారం నాడు మంగయిదేవి జాతర ప్రారంభమవుతుంది. నాలుగు రోజుల పాటు ఈ జాతర అట్టహాసంగా జరుగుతుంది. ఈ ఏడాది కూడా మంగళవారం(జున్ 11)న జాతర ప్రారంభమైంది. ఈ వేడుకకు భారీగా భక్తులు తరలివచ్చారు. కర్ణాటక నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన గోవా, మహారాష్ట్ర నుంచి కూడా మంగయిదేవి దేవతను దర్శించుకునేందుకు తరలివచ్చారు. ఈ క్రమంలో వారి వెంట తెచ్చుకున్న కోడిపిల్లలను మంగయిదేవి గర్భగుడిపై విసిరారు. ఈ ఆచారం చాలా ఏళ్లుగా కొనసాగుతోందని భక్తులు చెప్పారు. కోడిపిల్లలను అమ్మవారి గర్భగుడిపై వేస్తే తమ కోరికలు తీరతాయని భక్తులు విశ్వాసం వ్యక్తం చేశారు. కొన్నాళ్ల క్రితం అమ్మవారికి గొర్రెలు, కోళ్లను బలి ఇవ్వడాన్ని ఆలయ బోర్డు నిషేధించింది. ప్రస్తుతం ఆలయ గర్భగుడిపై కోడిపిల్లలను ఎగురవేస్తూ భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.
మంగయిదేవి జాతరకు ఎక్కువగా అమ్మాయిలు, మహిళలు వస్తారు. బెళగావి జిల్లానే కాకుండా వివిధ ప్రదేశాల నుంచి నూతనంగా వివాహమైన మహిళలు ఈ ఆలయానికి వస్తారు. అందుకే ఈ మంగయిదేవిని వడగావి వాసులు 'ఇంటి దేవత' అంటారు. భక్తులు గర్భగుడిపై విసిరిన కొన్ని కోడిపిల్లలు చనిపోతాయి. బతికిన వాటిని ఆలయ బోర్డు విక్రయిస్తుంది.