Detroit NRIs Hunger Strike: చంద్రబాబుకు మద్దతుగా మరోసారి కదం తొక్కిన డెట్రాయిట్ ఎన్నారైలు.. రిలే నిరాహార దీక్షలు
Published : Sep 25, 2023, 1:50 PM IST
|Updated : Sep 25, 2023, 1:58 PM IST
Detroit NRIs Hunger Strike: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఆరోపణలతో అరెస్టైనా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. అరెస్టుకు వ్యతిరేకంగా డెట్రాయిట్ ఎన్నారైలు మరోసారి కదం తొక్కారు. సీబీఎన్తో పాటే తామంటూ.. భారీ స్థాయిలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆదివారం ఫార్మింగ్టన్ హిల్స్‌లో ఈ రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ దీక్ష కొనసాగింది. ‘బాబుతో పాటే మేము’, ‘బాబు అరెస్టు అక్రమం’ అంటూ ఎన్నారైలు నినదించారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టీడీపీ, జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే అమెరికాలోని చంద్రబాబు అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టు విషయం తెలియగానే అమెరికాలోని మిచిగాన్ స్టేట్‌లోని డెట్రాయిట్ నగరంలోని తెలుగు ఎన్నారైలు ఒక్క చోటికి చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిరసన వ్యక్తం చేసిన ప్రదేశంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టి తమ వ్యతిరేకతను ప్రదర్శించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని ఈ డెట్రాయిట్ తెలుగు ఎన్నారైలు ఆరోపించారు. రాజకీయ కుట్రతోనే కక్ష కట్టి చంద్రబాబును జైల్లోకి పంపించారని విమర్శించారు.