అంతా చూస్తుండగానే వ్యాపారిని కాల్చి 4లక్షలు చోరీ - ఢిల్లీ జహంగీర్‌పురీ చోరీ
దిల్లీ జహంగీర్‌పురీ ప్రాంతంలో ఓ వ్యాపారి వద్ద నుంచి రూ.4లక్షలు కొట్టేశారు దొంగలు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే చోరీకి పాల్పడ్డారు. గత మంగళవారం జరిగిన ఈ ఘటన దృశ్యాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. మజ్లిస్ పార్క్‌లో ఉండే ఇషాన్ సాయంత్రం తన కారులో ఇంటికి వెళ్తున్నాడు. ఇద్దరు దుండగులు నరేలా ప్రాంతం నుంచి ఈయన్ను వెంబడించారు. ముకార్బా చౌక్ వద్ద అడ్డగించి కారును ఆపాలని బెదిరించారు. ఇషాన్ తన కారును ఆపకుండా ఇంకా వేగంగా పోనిచ్చాడు. అయితే, జంగిడ్ గుర్జార్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద రెడ్ లైట్ పడింది. దీంతో ఇషాన్ ముందుకెళ్లలేకపోయాడు. వెనకే వచ్చిన దొంగల్లో ఒకడు తుపాకీ పట్టుకొని వచ్చి కారులో ఉన్న ఇషాన్‌ను బెదిరించాడు. కారు అద్దాలు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించగా అదే సమయంలో అక్కడే ఆగిన ఓ వ్యక్తి వచ్చి దొంగలను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. దుండగులు తుపాకీతో బెదిరించేసరికి అతడు వెనక్కి వెళ్లిపోయాడు. చివరకు వ్యాపారిపై కాల్పులు జరిపి కారులో ఉన్న రూ.4లక్షలు ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటన అంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ప్రస్తుతం వ్యాపారి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనిపై మహీంద్ర పార్క్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:37 PM IST