Peddapalli Rains : వానొచ్చింది.. వరద తెచ్చింది.. పంట పొలాలను ముంచేసింది - రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు
Crops Damage Peddapalli Rains :గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు.. వరదలతో అన్నదాతలకు కంటిమీద కునుకులేకుండా పోయింది. పంటలు ముంపునకు గురవుతుండటంతో తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. పొలాలు చెరువులను తలపిస్తుండగా.. నార్లు మొదలు సాగులో ఉన్న పైరు వరకు దెబ్బతింటుండంటంతో ఆందోళన చెందుతున్నారు. ఇలాగే ఇంకొన్ని రోజులు వర్షం కొనసాగితే మరింత నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా కురిసిన వర్షాలకు అనేక పంటలు నీట మునిగాయి. వర్షాలకు.. మొలక దశలోనే ఉన్న పంట నీటిపాలైందని అన్నదాతలు లబోదిబోమంటున్నారు.
మంథని మండలం సిరిపురం గ్రామంలో నిర్మించిన పార్వతి బ్యారేజ్ నిండుకుండను తలపిస్తుండగా.. అధికారులు మొత్తం 74 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజ్ మొత్తం 130 మీటర్ల ఎత్తు కాగా.. ప్రస్తుతం 127 మీటర్ల ఎత్తులో నీటి ప్రవాహం దిగువకు వెళ్తోంది. పార్వతి బ్యారేజ్‌లోకి వచ్చే నీటి ప్రవాహం మరో మూడు మీటర్లు ఎత్తు పెరిగి 130 మీటర్లకు చేరితే మాత్రం.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యే అవకాశం ఉందిని అందుకే ప్రజలను అప్రమత్తం చేశామని అధికారులు చెబుతున్నారు. గుంజపడుగులోని గ్రామ వద్ద నిర్వహించిన సరస్వతి పంప్ హౌస్ చుట్టూ గోదావరి వరదనీరు భారీగా చేరింది. మంథని పట్టణం గుండా ప్రవహించే బొక్కలవాగు భారీగా ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తుండటంతో.. ఎప్పుడు వరద పోటెత్తుతుందోనని పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు.