గాలి వాన భీభత్సం.. నేలరాలిన పంటలు
సూర్యాపేట జిల్లా గాలి వాన భీభత్సం సృష్టించింది. మద్దిరాల మండలంలోని పలు గ్రామాల్లో వర్షం దంచికొట్టింది. అన్నదాతను ఈదురు గాలులతో కూడిన వర్షం కోలుకోలేని దెబ్బతీశాయి. దీంతో ఏపుగా పెరిగిన పంటలు వర్షార్పణమయ్యాయి. కుక్కడం ఆవాస తండాలో వరి, మొక్కజొన్న, మిర్చి, మామిడి కాయలు నేలరాలాయి. గ్రామంలో కొన్నిచోట్ల ఇంటి పైకప్పు రేకులు గాలికి ఎగిరిపోయాయి. ఈ క్రమంలోనే ఓ ఇంటిలో నిల్వ ఉంచిన 50 క్వింటాళ్ల పత్తి తడిసిపోయింది. ఇప్పుడు పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అకాలనష్టం నుంచి ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.
కొద్దిరోజుల క్రితం రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతలను నట్టేట ముంచాయి. ఈదురు గాలులు, వడగండ్ల వాన.. కర్షకులకు కడగండ్లనే మిగిల్చింది. పంట నష్టం జరిగన ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. రైతులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. ఈ క్రమంలోనే ఎకరానికి రూ.10,000 పరిహారం ప్రకటించారు.