నదిలో ఉండాల్సిన మొసలి పొలంలోకి వచ్చింది..
నీటిలో ఉండాల్సిన మొసలి పంట పొలాల్లో ఉంటే ఆశ్చర్యమే. కొంచెం హడావిడి వాతావరణం కూడా ఉంటుంది. ఇలాంటి ఘటనే వనపర్తి జిల్లాలో జరిగింది. పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో ఒక పెద్ద మొసలి పంట పొలాల్లో ప్రత్యక్షమైంది. గ్రామానికి చెందిన బాల్ రెడ్డి అనే రైతు వరి పొలంలో మొసలి వచ్చి చేరింది. పనుల కోసం పంట దగ్గరకు వెళ్లిన రైతులకు అక్కడ పొలంలో మొసలి కనిపించింది. గ్రామస్థులు వెంటనే జిల్లా స్నేక్ సొసైటీ నిర్వాహకులకు సమాచారం అందించారు. పంట పొలాల్లో మొసలి విహారం గురించి సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఆ గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్థుల సహాయంతో అధికారులు చేనులో ఉన్న మొసలిని తాడుతో కట్టేసి బంధించారు. పంట పొలం నుంచి రోడ్డు పైకి తెచ్చి వాహనంలో దానిని ఎక్కించి నీటిలో వదిలారు. గ్రామంలోకి మొసలి వచ్చిందంటే ఎవరికైనా ఒకింత ఆసక్తే. అందుకే ఆ గ్రామంలోని ప్రజలందరూ మొసలిని వీక్షించడానికి అది ఉన్న ప్రదేశానికి తరలివచ్చారు. 12 అడుగుల పొడవు 270 కేజీల బరువు గల ఈ మొసలిని గ్రామస్థులు అటవీ అధికారుల సూచన మేరకు ఆత్మకూరు మండలం జూరాల ప్రాజెక్టులో వదిలివేశారు.
TAGGED:
telangana latest news