సగం గుండు, మెడలో చెప్పుల దండ.. 4 గంటలు బురదలో నిలబెట్టి చిన్నారులకు శిక్ష - ఝార్ఖండ్ దొంగతనం న్యూస్
దొంగతనం చేశారన్న ఆరోపణలతో ఇద్దరు మైనర్లకు సగం గుండు కొట్టించిన ఘటన ఝార్ఖండ్ సాహిబ్‌గంజ్‌లో జరిగింది. ఇద్దరు బాలురకు సగం గుండుతో పాటు మెడలో చెప్పుల దండ వేసి శిక్షించారు గ్రామస్థులు. వీరిద్దరిని బురద కుంటలో దించి సుమారు నాలుగు గంటల పాటు నిలబెట్టారు.
ఇదీ జరిగింది
రాజ్‌మహాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఇద్దరు బాలురు దొంగతనం చేస్తూ దొరికిపోయారు. ఆదివారం గ్రామంలోని ఓ ఇంట్లోకి చొరబడ్డ వీరు.. రూ. 5,000 దొంగిలించారు. దీనిని గమనించిన ఓ మహిళ.. చుట్టుపక్కల వారిని పిలిచింది. ఒక బాలుడి దొరికిపోగా.. మరో బాలుడు పారిపోయాడు. అనంతరం అతడిని పిలిపించి విచారించగా.. ఇద్దరు తాము చేసిన తప్పును ఒప్పుకున్నారు. దొంగతనం చేసిన నగదును తిరిగి చెల్లిస్తామని పిల్లలు చెప్పినా వినలేదు గ్రామస్థులు.
వారిద్దరికీ సగం గుండు చేయించి.. మెడలో చెప్పుల దండ వేశారు. ఇద్దరినీ బురద కుంటలో దించి సుమారు నాలుగు గంటల పాటు నిలబెట్టారు. అనంతరం గ్రామస్థులందరూ.. వివిధ వస్తువులను వారిపైకి విసిరారు. ఇంతలో దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని బాలురను విడిపించారు. చికిత్స కోసం రాజ్‌మహాల్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. వీరిద్దరూ అనేక సార్లు దొంగతనం చేసి దొరికిపోయినా వదిలేశామని.. వారు మారకపోవడం వల్లే ఇలా చేశామని గ్రామస్థులు చెప్పుకొచ్చారు. అయితే, బాధితుల తల్లిదండ్రులు మాత్రం.. తమ కుమారులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.