లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్లాం: కూనంనేని
Published : Jan 4, 2024, 4:36 PM IST
CPI Kunamneni on Parliament Elections : కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని భద్రాద్రి ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. రాష్ట్రంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి వెళ్దామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని సచివాలయంలో కలిసినప్పుడు అడిగినట్లు కునంనేని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉండాలన్నారు.
ఐదు పార్లమెంటు స్థానాలపై సీపీఐ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు కూనంనేని పేర్కొన్నారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం, పెద్దపల్లి, భువనగిరి స్థానాలపై ఫోకస్ పెట్టామని తెలిపారు. ప్రజలు అనేక ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారన్నారు. కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్నప్పటికీ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హడావుడి వల్ల వారికే నష్టం వాటిల్లుతుందన్నారు. ప్రభుత్వం మారిందని బీఆర్ఎస్ నేతలు గుర్తించుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. కొత్త ప్రభుత్వానికి హామీల అమలుకు కొంత సమయం ఇవ్వాలని, అలా చేయకపోతే ప్రజాస్వామ్యనికి విరుద్ధమన్నారు.