తిరుమల ఘాట్ రోడ్లో చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు
గత కొంతకాలంగా తిరుమలకు వెళ్లే భక్తులకు చిరుత పులుల భయం పట్టుకుంటోంది. కరోనా సమయం నుంచి అటవీ ప్రాంతంలోని జంతువులు.. తిరుమల కొండపైన ప్రాంతాల్లోకి రావడం పరిపాటిగా మారింది. నిత్యం తిరుమలలో ఎక్కడో ఒక చోట వన్యప్రాణులతో తిరుమలకు వచ్చే భక్తులు ఇబ్బందులకు గురికావడమో.. లేదా భక్తుల వల్ల వన్యప్రాణులు ఇబ్బంది పడటం జరగుతూ వస్తోంది. ఇప్పటికే ఎన్నోసార్లు చిరుత పులులు భక్తుల కంటపడగా.. తాజాగా మరోసారి చిరుత సంచారం కలకలం రేగింది.
తిరుమలలోని మొదటి కనుమ దారిలో రోడ్డులోని 35వ మలుపు వద్ద చిరుత పులి సంచరించింది. దీంతో తిరుపతికి వెళ్తున్న వాహన చోదకులు, భక్తులు భయాందోళనకు గురయ్యారు. ఆ చిరుత నీటిని తాగడానికి వచ్చినట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. మెుదట చిరుతను చూసిన భక్తులు ఆందోళనకు గురయ్యారు. తర్వాత తెరుకొని అటవీ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు చిరుతను అటవీ ప్రాంతంలోకి దారి మళ్లించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.