Central Minister Shobha Karandlaje Fires on BRS Govt : 'దేశవ్యాప్తంగా ఫసల్‌బీమా అమలవుతుంటే.. తెలంగాణలో ఎందుకు అమలు కావడం లేదు' - మంత్రి శోభా కరంద్లాజే బీఆర్‌ఎస్‌పై ఫైర్
Published : Oct 11, 2023, 2:29 PM IST
Central Minister Shobha Karandlaje Fires on BRS Govt: రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని కేంద్రమంత్రి శోభా కరందాజ్లే ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వ సమస్య ఏంటో తెలియడం లేదని.. దేశవ్యాప్తంగా ప్రధాన మంత్రి ఫసల్‌బీమా యోజన అమలు అవుతుంటే.. తెలంగాణలో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలో పర్యటించిన కేంద్రమంత్రి శోభా కరందాజ్లే.. ఈ మేరకు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఫసల్ బీమా తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా లేదని ఆరోపించారు. రైతులను ఇబ్బందులు పెట్టే ప్రభుత్వం కావాలో.. మేలు చేసే ప్రభుత్వం కావాలో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు.
రెండు సార్లు బంగారు తెలంగాణ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ప్రజలకు చేసింది ఏమీ లేదని బీజేపీ నేత విష్ణువర్థన్‌రెడ్డి విమర్శించారు. బంగారు తెలంగాణ ఏమో కానీ.. కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారు కుటుంబంగా మారిందన్నారు. పోటీ పరీక్షలు సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. మోదీ వ్యాఖ్యలపై కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దళిత బంధు పేరుతో కేసీఆర్ దళితులను మోసగించారన్నారు. రజాకార్ల పాలన కావాలంటే బీఆర్ఎస్‌కు, ఎంఐఎంకు ఓటు వేయాలని.. ప్రజాపాలన కావాలంటే బీజేపీకి ఓటు వేయాలన్నారు.