BRS And Congress Clash In Yadadri : రైతు దినోత్సవ సదస్సు వేదికగా కుర్చీలతో యుద్ధం - telangana decade day
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు నిర్వహిస్తోన్న రైతు దినోత్సవంలో రసాభాస చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బొల్లేపల్లి రైతు వేదికలో నిర్వహించిన రైతు దినోత్సవ సదస్సులో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు మధ్య పరస్పర వాగ్వాదం చోటుచేసుకుంది. గత రెండు నెలలుగా ధాన్యం కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు వేగవంతంగా నిర్వహించట్లేదంటూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతు దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం వద్దకు ఆయన వెళ్లారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కంచర్ల భూపాల్ రెడ్డిని ధాన్యం ఎందుకు కొనడం లేదని ప్రశ్నించారు. దీంతో వారి అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి.. ఒకరినొకరు తోసుకున్నారు. సమావేశంలోని కుర్చీలను విసురుకున్నారు. దీంతో సమావేశంలో కాసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడింది. పోలీసులు వచ్చి ఇరు వర్గాలను సముదాయించారు. ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం ఆలస్యం చేయటంతో వర్షాకాలం ఆరంభం అవుతున్నా.. ఇప్పటికే రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు పడాల్సి వస్తుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. రైతులకు డబ్బులు ఎప్పుడు రావాలి. ఎప్పుడు నారు పోసుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.