Boy Killed Hit By Car Viral Video : గుడి వద్ద మూత్ర విసర్జన.. అడిగినందుకు విద్యార్థిపైకి కారు పోనిచ్చి! - తిరువనంతపురం
Published : Sep 10, 2023, 8:11 PM IST
Boy Killed Hit By Car Viral Video : పదో తరగతి చదువుతున్న విద్యార్థిపై కారు పోనిచ్చి అతడి మరణానికి కారణమైన వ్యక్తిపై పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. అయితే నిందితుడు.. బాధితుడికి దూరపు బంధువు కావడం గమనార్హం. కేరళలోని తిరువనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బాధితుడిని శేఖర్‌గా పోలీసులు గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని పూవాచల్ ప్రాంతంలో ఆగస్టు 30వ తేదీన సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సైకిల్‌పై బయటకు వెళ్దామనుకున్న శేఖర్ తన స్నేహితుడితో రోడ్డు మీదుకు చేరుకున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి కారుతో వచ్చిన ప్రియరంజన్ అతడిపైకి పోనిచ్చాడు. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. ఘటనపై బాధితుడు కుటుంబసభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
"మేం మొదట యాక్సిడెంట్ కేసు నమోదు చేశాం. కానీ బాలుడి అంత్యక్రియల తర్వాత కొంతమంది బంధువులు అనుమానాలు లేవనెత్తారు. దీంతో సీసీటీవీ విజువల్స్ పరిశీలించాం. నిందితుడిపై హత్యకేసు నమోదు చేశాం. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. అయితే నిందితుడు కొద్దిరోజుల క్రితం.. ఆలయం సమీపంలో మూత్రవిసర్జన చేశాడు. ఆ సమయంలో అతడిని బాధితుడు నిలదీశాడు. ఆ కోణంలోనే కేసును దర్యాప్తు చేస్తున్నాం" అని పోలీసులు తెలిపారు.