నదిలో పడి వృద్ధుడు మృతి.. మృతదేహాన్ని తెచ్చేందుకు వెళ్లిన పడవ బోల్తా - యూపీలో కెన్ నదిలో పడవ బోల్తా
నదిలో పడి చనిపోయిన ఓ వృద్ధుడి మృతదేహాన్ని తీసుకువచ్చేందుకు వెళ్లిన ఓ పడవ ప్రమాదానికి గురైంది. నదిలో నుంచి మృతదేహాన్ని తీసుకువస్తుండగా అదుపు తప్పి పడవ బోల్తా పడింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హమీర్పుర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అంతకముందు మౌదాహ కొత్వాలి పరిధిలోని బైజెమావు గ్రామానికి చెందిన ధనిరామ్ (70) అనే వృద్ధుడు.. శుక్రవారం కెన్ నదిలో పడి చనిపోయాడు. అనంతరం వృద్ధుడి మృతదేహం నదిలో పైకి తేలింది. అది గమనించిన మృతుడి బంధువులు.. పడవలో మృతదేహాన్ని బయటకు తీసువచ్చేందుకు వెళ్లారు. అనంతరం తిరిగి వస్తూ అందరు ఒకే పక్కకు వచ్చారు. దీంతో అదుపు తప్పిన పడవ.. నదిలోనే బోల్తా పడింది. దీంతో పడవలో ఉన్న ఎనిమిది మంది అందులో పడిపోయారు. వారిలో ఏడుగురికి ఈత రావడం వల్ల సురక్షితంగా ఒడ్డుకు వచ్చారు. మరో యువకుడికి ఈత రాకపోవడం వల్ల ఒడ్డుకు వచ్చేందుకు కాస్త ఇబ్బంది పడ్డాడు. అది గమనించిన స్థానికులు.. వెంటనే యువకుడికి కాపాడారు.