BJP Leaders Protest on Nirmal Master Plan : ఉద్రిక్తతకు దారితీసిన మాస్టర్ ప్లాన్ ఆందోళన.. బీజేపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్ - Nirmal district latest news
BJP Leaders Protest on Nirmal Master Plan : నిర్మల్ పట్టణ నూతన బృహత్ ప్రణాళికను రద్దు అంశంపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఐదోరోజుకు చేరుకుంది. దీక్ష చేస్తున్న మహేశ్వర్ రెడ్డి ఆరోగ్యం క్షీణించినా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందిచపోవడం సరికాదని నేతలు మండిపడ్డారు. నిర్మల్‌లో బీజేపీ శ్రేణులు చేపట్టిన రాస్తారోకో స్వల్ప ఉద్రిక్తతలకు దారితీసింది. రోడ్డుపై బైఠాయించి... మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తాజాగా ఆదివారం మధ్యాహ్నం మహేశ్వర్ రెడ్డి దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపేందుకు వస్తున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణను నిజామాబాద్ జిల్లాలోని చాకిర్యాల గ్రామం వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. అందుకు నిరసనగా నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు మహిళలు రోడ్డు ఎక్కారు. పట్టణంలోని గాజుల పేట్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. అక్కడి నుంచి మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి నివాసం వరకు ర్యాలీ నిర్వహించారు. మంత్రి నివాసాన్ని ముట్టడించే యత్నంలో పోలీసులు మళ్లీ లాఠీలకు పని చెప్పారు. ఆందోళనకారులను ఎక్కడికక్కడ చెదరగొట్టారు.