Etela fires on kcr : "ధనిక రాష్ట్రమంటూ చెబుతూ.. రైతులను దగా చేశాడు" - Telangana latest political news
Etela rajender on agricutural loans : ధనిక రాష్టం.. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని బీజేపీ రాష్ట్ర ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. రాష్ట్రంలోని రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీ చేస్తానని చెప్పి.. మోసం చేశారని మండిపడ్డారు. తెలంగాణలో కాషాయ జెండా ఎగరాలని.. మోదీ తీవ్రంగా ఆకాంక్షిస్తున్నారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు పార్లమెంట్లో చెట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారని.. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తిరిగి అది కేసీఆర్‌కే వెళ్తుందని దుయ్యబట్టారు. తెలంగాణ కోసం 14 ఏళ్లు పోరాటం చేస్తే చిల్లర ఆరోపణలు చేసి తనను బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పంపారని ఆవేదన వ్యక్తంచేశారు. అహర్నిశలు శ్రమించి తెలంగాణలో పార్టీని గెలిపించాలని వరంగల్ సభలో ప్రధాని మోదీ, జేపీ నడ్డా చెప్పారని.. సీఎం కేసీఆర్‌ను గద్దె దించడమే తన కర్తవ్యమన్నారు. సీఎం కేసీఆర్‌తో కొట్లాడడానికే తనను రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ చేశారని తెలిపారు. కట్టిన డబుల్ బెడ్రూం ఇండ్లను పంచని సీఎం కేసీఆర్, మంత్రివర్గం.. ఏ ముఖం పెట్టుకుని గ్రామాల్లోకి వెళ్తారని ఎద్దేవా చేశారు.