హైదరాబాద్ వాసులకు అలర్ట్ - ట్యాంక్‌బండ్‌పై బర్త్ డే సెలబ్రేషన్స్ బ్యాన్ - Birth Day Celebrations Banned at Tank Bund
Published : Nov 8, 2023, 3:19 PM IST
Birth Day Celebrations Banned at Tank Bund :హైదరాబాద్ వాసుల్లో చాలా మంది తమ బర్త్ డే వేడుకలు హుస్సేన్ సాగర్ పరిసరాల్లో.. ముఖ్యంగా ట్యాంక్ బండ్ వద్ద చేసుకుంటారు. స్నేహితులు, ఫ్యామిలీతో కలిసి అర్ధరాత్రి 12 గంటల సమయంలో పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుని హంగామా చేస్తుంటారు. ఆ క్షణాలను మొబైల్లో బంధిస్తూ వాట్సాప్ స్టేటస్లు, ఇన్‌స్టా పోస్టులు పెడుతుంటారు. అయితే ఇక నుంచి అక్కడ జన్మదిన వేడుకలు చేసుకోవడానికి వీల్లేదట. ట్యాంక్ బండ్‌పై బర్త్ డే సెలబ్రేషన్స్ జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు.
Birth Day Celebrations Ban at Tank Bund in Hyderabad : రోజు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు కొందరు ట్యాంక్ బండ్‌పై.. జన్మదిన వేడుకల సందర్భంగా.. కేక్ కట్ చేసి నానా హంగామా సృష్టించడమే కాకుండా అటుగా వెళ్లే ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. చెత్తా చెదారం అక్కడే వదిలి వెళ్లిపోతున్నారని.. దానివల్ల పర్యాటక ప్రాంతమంతా అపరిశుభ్రంగా తయారవుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలో పుట్టిన రోజు వేడుకలు నిషేధించినట్లు వెల్లడించారు. సీసీటీవీ ద్వారా నిరంతరం ఆ పరిసరాలపై నిఘా ఉంచుతామని వివరించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.