వరదల్లో కొట్టుకుపోయిన 2 కార్లు.. రంగంలోకి NDRF.. ఏడుగురు సేఫ్.. డ్రైవర్ మృతి - గుజరాత్లో పొంగిపొర్లుతున్న నదులు
Cars Stuck In Flood Water : బిపోర్‌జాయ్ తుపాన్ ధాటికి గుజరాత్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం బనాస్కాంఠా జిల్లాలో భారీ వర్షాలు కురవడం వల్ల వాగులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లు కూడా కొట్టుకుపోతున్నాయి. అయితే అల్వాడా గ్రామంలోని రోడ్డుపై వెళ్తున్న ఒక బొలెరో, ఒక ఎకో కారు నీటి ప్రవాహంలో చిక్కుకున్నాయి. ఒక్కసారిగా వరద పోటెత్తడం వల్ల రెండు కార్లు కూడా కొట్టుకుపోయాయి.
సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుంది. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది. బొలెరో కారులో ఉన్న నలుగురిని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించి ఒడ్డుకు చేర్చింది. అలాగే ఎకో కారులో ఉన్న ముగ్గురిని రక్షించగా.. ఆ వాహన డ్రైవర్ వరదలో కొట్టుకుపోయాడు. దీంతో అతడు రాజోడా గ్రామంలో మృతదేహంగా వరద నీటిలో తేలాడు. మృతుడిని రవిభాయ్గా అధికారులు గుర్తించారు.
Biporjoy Cyclone news : ఇటీవలే తీరం దాటిన బిపోర్‌జాయ్ తుపాను గుజరాత్‌ను అతలాకుతలం చేసింది. తుపాను ధాటికి 5,120 విద్యుత్ స్తంభాలు, వేలాది చెట్లు నేలకూలాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అధికారులు అప్రమత్తమై దాదాపు లక్షమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం వల్ల ప్రాణ నష్టం తప్పింది.