Bhupalpally Rains News Today : మత్తడి దూకుతున్న చెరువులు.. రోడ్లపైనే చేపలు పడుతున్న జనాలు - తెలంగాణ న్యూస్
Bhupalpally Rains News : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షానికి రేగొండ మండలంలోని చెరువులు మత్తడి పోస్తూ వరద తాకిడికి రోడ్లన్నీ పాడయ్యాయి. భారీ వృక్షాలు విరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గుడికుంట చెరువు మత్తడి తెగడం వల్ల పంట చేలు మునిగిపోయాయి. వరద నీరు ఇండ్లలోకి చేరింది. అధికారులు చర్యలు చేపట్టి రక్షణ కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు. పరకాల ప్రధాన రహదారి పై వరద రావడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. నీటి వరదకు రోడ్డు పైకి నీళ్లు రావడంతో చుట్టు పక్కల గ్రామస్థులు చేపల వేటకు వచ్చి చేపలు పడుతున్నారు. ఓ పక్క రైతు నష్టపోయి కన్నీళ్లు పెట్టుకుంటుంటే.. ఇంకో పక్క పొలాల్లో చేపలు పట్టుకుంటున్నారు. మురికి కాలువలు, కల్వర్ట్లు సరిగా లేక నీరు రోడ్లపై నిలుస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్యలు గుర్తించి శాశ్వత పరిష్కారం అయ్యే విధంగా చేయాలని రైతులు కోరుతున్నారు.