పెట్టుబడులను ఆకర్షించాలంటే స్పెషాలిటీ కెమికల్స్‌పై దృష్టి పెట్టాలి : కృష్ణ ఎల్ల
Published : Jan 19, 2024, 1:53 PM IST
Bharat Biotech Chairman Krishna Ella On Pharma Sector : ఔషధ రంగంలోకి పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షించాలంటే స్పెషాలిటీ కెమికల్స్‌పై దృష్టి సారించడం మేలని భారత్ బయోటెక్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్ల అభిప్రాయపడ్డారు. దీంతో పాటు ఇంటర్మీడియెట్స్, క్లినికల్ ట్రయల్స్‌కు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. హైదరాబాద్‌లో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫార్మా మీట్ సదస్సులో కృష్ణ ఎల్ల పాల్గొని ప్రసంగించారు.
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ఔషధ రంగ పెట్టుబడులను ఆకర్షించేడమే లక్ష్యంగా ఈ సదస్సును ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఫార్మా విధానాన్ని ఆవిష్కరించడంతో పాటు బల్క్ డ్రగ్ పార్క్, మెడ్‌టెక్ పార్క్‌లకు సంబంధించిన వివరాలను అందుబాటులో ఉంచింది. అదేవిధంగా తమ రాష్ట్రంలో కల్పిస్తున్న సదుపాయాలు, ప్రోత్సాహకాలను వివరించింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఫార్మా ప్రముఖులు పాల్గొన్నారు.
సాధారణ ఫార్మాతో సరిపెట్టుకోకుండా, కొంత భిన్నంగా ఉండే స్పెషాలిటీ కెమికల్స్, క్లినికల్ ట్రయల్స్‌కు పెద్దపీట వేయడం మేలని ఉత్తర్‌ప్రదేశ్ సర్కార్‌కు కృష్ణ ఎల్ల సూచించారు. ఔషధ రంగానికి చెందిన అంకుర సంస్థలను ప్రోత్సహించాలని, అందుకు ప్రత్యేకంగా ఒక నిధి ఏర్పాటు చేయాలని కృష్ణ ఎల్ల వివరించారు. ఈ కార్యక్రమానికి ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు, తెలంగాణకు చెందిన పారిశ్రామికవేత్తలు, తెలంగాణ డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ కమల్ హాసన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.