Begging Racket Arrest Hyderabad : హైదరాబాద్‌లో బెగ్గింగ్ మాఫియా.. రోజుకు రూ.200 ఇచ్చి వృద్ధులతో.. - Begging Racket busted Hyderabad
Begging Racket Arrest Hyderabad : హైదరాబాద్‌లో బెగ్గింగ్ రాకెట్ ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఛేదించారు. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్క్ ప్రాంతాల్లోని పలు కూడళ్లలో భిక్షాటన చేస్తున్న 23 మందిని అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో వారిని రెస్క్యూ హోమ్‌కు తరలించారు.
సిగ్నల్స్ వద్ద భిక్షాటన చేస్తున్నవారు వాహనదారులకు ఇబ్బందులు కలగజేస్తున్నారని.. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరికొద్ది రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. అంతేగాక రాకెట్ నిర్వాహకుడు అనిల్ పవార్(Hyderabad Begging Mafia)గా గుర్తించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద యాచకులందరి నుంచి రోజుకు 4వేల 500 నుంచి 6వేలు సంపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో వృద్ధుడికి రోజుకు రూ.200 కూలీగా చెల్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిర్వాహకుడిపై భిక్షాటన నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. ఈ కార్యక్రమం పూర్తి అయ్యేసరికి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.